Templates by BIGtheme NET
Home >> Cinema News >> ట్రోలింగ్.. నయన్ బాటలో మరో స్టార్ హీరోయిన్?

ట్రోలింగ్.. నయన్ బాటలో మరో స్టార్ హీరోయిన్?

సినిమా సక్సెస్ కి స్టార్ల ప్రమోషన్ చాలా కీలకం. రిలీజ్ ముందు హైప్ పెంచి జనాల్ని థియేటర్లకు రప్పించేందుకు ఇది ఉపకరిస్తుంది. కానీ కొందరు పొరుగు భాషల హీరోయిన్లు టాలీవుడ్ లో నటిస్తున్నా ప్రచారానికి మాత్రం దూరంగా ఉంటున్నారు. దీనిపై ఇప్పటికే దర్శకనిర్మాతలు సీరియస్ గా ఉన్న సంగతి తెలిసినదే. కోట్లాది రూపాయల పారితోషికాలు వసూలు చేస్తూ కనీసం ప్రచారానికి సహకరించకపోవడంపై గుర్రుగా ఉన్నారు.

అయితే నయనతార లాంటి స్టార్ హీరోయిన్ .. తాను ఒప్పందంలోనే ప్రచారానికి రానని నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అలా అయితేనే సంతకాలు చేస్తారు. అయితే అందరూ నయనతారలే అవ్వాలని రూలేం లేదు. ఇతర నాయికలు అలా భేషజాలకు వెళితే కష్టమే. కోట్లాది రూపాయల బడ్జెట్లు పెట్టే నిర్మాతలకు ప్రమోషన్ సరిగా లేక ఫెయిలైతే దాని ప్రభావం పరిశ్రమపైనా తీవ్రంగా పడుతుంది.

తాజాగా సంక్రాంతి కానుకగా రిలీజైన `క్రాక్` ప్రమోషన్ విషయంలో శ్రుతిహాసన్ కనిపించకపోవడం గుసగుసలకు కారణమైంది. భారీ పారితోషికం అందుకునే శ్రుతి ఎందుకని ప్రచారానికి రాలేదు. కథానాయకుడు రవితేజ ఇతర టీమ్ ప్రచారానికి సహకరిస్తుంటే.. తనకు ఎందుకీ భేషజం? అంటూ ప్రశ్నిస్తున్నారు. క్రాక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో కనిపించలేదు. కనీసం వీడియో ఇంటర్వ్యూలు అయినా ఇవ్వకపోవడం చర్చకు వచ్చింది. దీంతో శ్రుతి కూడా నయన్ ని అనుసరిస్తోందా? అన్న సందేహాలకు ఆస్కారం ఏర్పడింది. ప్రమోషన్లకు హాజరుకాకూడదని ఎంచుకోవడం ఒప్పందంలో భాగం కావచ్చు. లేకపోతే వారికి ముందస్తు కట్టుబాట్లు ఉండవచ్చు. కానీ ఇలా కీలక సమయంలో లైట్ తీస్కోవడమే అర్థం కాని వ్యవహారం.

మరీ అంత కఠినంగా ఉండడం సరైనదేనా? అన్న ప్రశ్న శ్రుతి ముందు ఉంది. క్రాక్ లో శ్రుతి పాత్ర పరిధి చిన్నదే కావొచ్చు. అయితే ద్వితీయార్థంతో పోలిస్తే ప్రథమార్థంలో తన పాత్ర పరిధి పెద్దదే. హీరోతో వందశాతం రొమాన్స్ కి ఆస్కారం ఉన్న పాత్రలు అయితేనే ప్రచారం చేయాలన్న రూలేం లేదు. క్రాక్ కి మంచి టాక్ వచ్చిన నేపథ్యంలో నాయికతోనూ ప్రమోషన్ చాలా కీలకం. కానీ శ్రుతి దానికి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. ఒకవేళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాకి కూడా ఇలానే శ్రుతి ఒప్పందం చేసుకుందా? వకీల్ సాబ్ ప్రచారానికి కూడా రానని ముందే చెప్పేసిందా? ఈ సమ్మర్ లో రిలీజ్ కి వస్తున్న వకీల్ సాబ్ ప్రచారానికి శ్రుతి వస్తుందా? రాదా? అన్నది చర్చకు వచ్చింది.

Share via
Copy link