Templates by BIGtheme NET
Home >> Cinema News >> అందాలరాశి అలిగిందా?

అందాలరాశి అలిగిందా?

టాలీవుడ్ తెరకి గ్లామర్ టచ్ ఇచ్చిన అందమైన కథానాయికలలో రాశి ఖన్నా ఒకరు. ముద్దుగా .. బొద్దుగా .. అమాయకంగా .. అందంగా కనిపించే రాశి ఖన్నాకు అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలో తళుక్కున మెరిసిన ఈ అమ్మాయికి ‘జిల్’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ‘బెంగాల్ టైగర్’ .. ‘సుప్రీమ్’ సినిమాలతో రాశి ఖన్నా క్రేజ్ పెరిగింది. ఆవగింజంత కూడా వంకబెట్టలేని అందంతో ఆమె కుర్ర ప్రేక్షకుల గుండె గోడలను కూల్చేసింది. వాళ్ల కలల కోటలో మెరుపులా మేను వాల్చేసింది.

రాశి ఖన్నా .. రకుల్ .. రెజీనా కాస్త అటూ ఇటుగా తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఈ ముగ్గురిలో రకుల్ తన దూకుడు చూపుతూ దూసుకెళ్లింది. ఇక రెజీనా కూడా కాస్త ఘాటుగా .. నాటుగా కనిపించడానికి సిద్ధపడుతూ స్పీడ్ పెంచింది. కానీ రాశి ఖన్నా మాత్రం నిదానమే ప్రధానమన్నట్టుగా ఒకో సినిమానే చేస్తూ వెళ్లింది. ఆ సినిమాల జయాపజయాల సంగతి అటుంచితే గ్లామర్ పరంగా రాశి ఖన్నాకి పడవలసిన మార్కులు పడుతూనే వచ్చాయి. మీగడ పెరుగులాంటి ఈ అమ్మాయికి సరైన హిట్ పడితే ఎక్కడో ఉండేదనే అభిప్రాయాలు వినిపించాయి.

ఇక రాశి ఖన్నా తన కెరియర్లో చేసిన పొరపాటు ఏదైనా ఉందంటే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో ‘యామిని’ పాత్రకి ఓకే చెప్పడమే. అప్పటివరకూ పద్దతికి పట్టుచీరకట్టినట్టు కనిపిస్తూ వచ్చిన ఈ అమ్మాయిని ఆ పాత్రలో అభిమానులు అంగీకరించలేకపోయారు. ఆ సినిమా పరాజయంపాలు కావడంతో వ్రతం చెడినా ఫలితం దక్కకుండా పోయింది. ఈ సినిమా తరువాత రాశి ఖన్నా వరుసగా తమిళ సినిమాలను ఒప్పుకోవడం విశేషం. తెలుగులో కొత్త ప్రాజెక్టులలో ఎక్కడా ఆమె పేరు వినిపించడం లేదు. కనీసం గాసిప్స్ లో కూడా కనబడటం లేదు. మరి ఈ అందాలరాశి టాలీవుడ్ పై అలిగి వెళ్లిందా? అవకాశాలు లేక వెళ్లిందా? అనే ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి .

Share via
Copy link