Templates by BIGtheme NET
Home >> Cinema News >> కాలేజ్ లెక్చరర్ గా పవన్ సందేశం ఇస్తారట!!

కాలేజ్ లెక్చరర్ గా పవన్ సందేశం ఇస్తారట!!

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయ్యప్పనుమ్ కోషియం చిత్రీకరణ సహా క్రిష్ దర్శకత్వంలోని హిస్టారికల్ మూవీ కోసం పవన్ షెడ్యూళ్లను కేటాయించారు. ఈ రెండిటి తర్వాత హరీష్ శంకర్ తో సినిమా చేయాల్సి ఉంది.

గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన దర్శకుడిగా హరీష్ కి పవన్ అభిమానుల్లో చక్కని గౌరవం గుర్తింపు ఉంది. మళ్లీ ఈ జోడీ కలిసి పని చేస్తారు అనగానే అందరిలో ఒకటే ఉత్కంఠ. అయితే ఈసారి పవన్ ని హరీష్ ఏ తరహా పాత్రలో చూపిస్తారు? అన్నదానిపై అభిమానుల్లో చర్చ సాగుతోంది.

ఇప్పటికే పవన్ కి సంఘంలో ప్రత్యేక ఇమేజ్ ఉంది. జనసేనానిగా మారిన ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని హరీష్ అదిరిపోయే కథను రెడీ చేస్తున్నాడట. ప్రీప్రొడక్షన్ వేగవంతం అయ్యింది. మాస్టర్ .. ఠాగూర్ (చిరు నటించిన బ్లాక్ బస్టర్స్) తరహాలో సమాజానికి మంచి చెప్పే విధంగా ఈ సినిమా కథాంశం ఉంటుందని కూడా తెలిసింది. ఇందులో పవన్ లెక్చరర్ గా కనిపిస్తారని.. కాలేజ్ నేపథ్యంలో ఒక బలమైన సామాజిక సమస్య నేపథ్యంలో కథాంశం ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే సామాజిక సమస్యను ఎంచుకున్నా కానీ దానిని ఫక్తు కమర్షియల్ ఫార్మాట్ లో చూపించడంలో హరీష్ సిద్ధహస్తుడు. పవన్ ని క్లాస్ గానే కాదు.. మాస్ కోణంలోనూ చూపించే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇందులో శ్రుతి నటించేందుకు ఆస్కారం లేకపోగా కియరా నటిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దేవీ శ్రీ సంగీతం అందిస్తారు. మైత్రి సంస్థ నిర్మించనుంది.

Share via
Copy link