Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఫ్లాష్‌బ్యాక్ నిజమైతే ఏంటి.. ఫేకైతే ఏంటి?

ఫ్లాష్‌బ్యాక్ నిజమైతే ఏంటి.. ఫేకైతే ఏంటి?

ఖైదీ, విక్రమ్ చిత్రాల తర్వాత లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘లియో’ సినిమాకు ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే. కానీ ఆ హైప్‌కు తగ్గట్లు సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందారు. ముఖ్యంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్‌ (ఎల్సీయూ)తో ఈ సినిమాకు కనెక్షన్ ఉంటుందని.. ఈ దిశగా బోలెడన్ని ట్విస్టులుంటాయని ఆశిస్తే ఏదో నామమాత్రంగా కొన్ని లింకులు పెట్టారే అందులో పెద్దగా కిక్కేమీ లేదు. ఇక సినిమాలో క‌థాక‌థ‌నాల గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. సినిమా మొత్తం పార్తిబ‌న్‌గా చ‌లామ‌ణి అవుతున్న వ్య‌క్తిని ప‌ట్టుకుని నువ్వు లియోనే క‌దా నువ్వు లియోనే క‌దా అని విల‌న్లు స‌హా అంద‌రూ అడ‌గ‌డం.. అత‌ను కాదు మొర్రో అని మొత్తుకోవ‌డం.. అవ‌త‌లి వాళ్లు అత‌ణ్ని వెంటాడ‌టం ఇదీ వ‌ర‌స‌. రిపీటెడ్ సీన్ల‌తో సినిమా విసిగించేసి ప్రేక్ష‌కుల‌తో దండం పెట్టించేసింది.

ఐతే సినిమా ప్రేక్ష‌కుల తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యాక ఈ సినిమాలో ట్విస్టుల గురించి చ‌ర్చ న‌డుస్తోంది. సినిమాలో హీరో ఫ్లాష్ బ్యాక్‌గా చూపించేదంతా అబ‌ద్ధం అన్న దానిపై సోష‌ల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. స్వ‌యంగా ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజే హీరో ఫ్లాష్ బ్యాక్ అంతా అబ‌ద్ధం అని తేల్చేశాడు. అలాగే సినిమాలో హీరోను పార్తిబ‌న్ అని పిలిస్తే ప‌ల‌క‌డ‌ని.. కేఫ్ ఫైట్ సీన్ నుంచే అత‌ను లియోలా ప్ర‌వ‌ర్తిస్తుంటాడ‌ని కూడా చెప్పాడు. ఐతే ఇవన్నీ ఇప్పుడు చెప్పి ఏం లాభం అన్న‌ది ప్ర‌శ్న‌. సినిమాలో మ‌నం చూసింది అబ‌ద్ధం అయితే.. అది సినిమాలోనే ఏదో ఒక ద‌శ‌లో రివీల్ చేయాలి. డార్లింగ్, పిజ్జా లాంటి సినిమాల్లో అలాగే చేసి ప్రేక్ష‌కుల‌కు ట్విస్ట్ ఇస్తారు. అలా కాకుండా సినిమాలో ఏం చెప్ప‌కుండా బ‌య‌ట ఇది ఫేక్ ఫ్లాష్ బ్యాక్ అని ట్విస్ట్ ఇవ్వ‌డంలో ఆంత‌ర్య‌మేంటో? అంతా లియో-2 రివీల్ చేద్దామ‌ని అనుకున్నారేమో కానీ.. ఈ సినిమాకు వ‌చ్చిన రిజ‌ల్ట్ చూశాక మ‌ళ్లీ సీక్వెల్ తీయ‌డం సందేహంగానే ఉంది. లోకేష్‌కు ఉన్న క‌మిట్మెంట్ల మ‌ధ్య ఈ సినిమా చేయ‌డం కూడా తేలిక కాదు.

Share via
Copy link