Templates by BIGtheme NET
Home >> Cinema News >> గుణ సెట్ రెడీ అవుతుందట

గుణ సెట్ రెడీ అవుతుందట

టాలీవుడ్ లో రాజమౌళి కంటే ముందు భారీ సెట్టింగ్ లు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు గుణశేఖర్. ఇండస్ట్రీలో మొదటి కోటి రూపాయల సెట్ వేసింది.. వేయించింది గుణశేఖర్. ఒక్కడు కోసం ఛార్మినార్ ను అర్జున్ సినిమా కోసం మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ ను నిర్మించిన గుణశేఖర్ రుద్రమదేవి సినిమా కోసం కాకతీయుల కోటను రీ క్రియేట్ చేయించాడు. గుణశేఖర్ సినిమా అంటేనే ఒకప్పుడు సెట్ ల కోసం అయినా సినిమాలు చూడవచ్చు అనుకునే వారు. రుద్రమదేవి తర్వాత అయిదు సంవత్సరాలకు పైగా గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ ప్రస్తుతం సమంతతో ‘శాకుంతలం’ సినిమాను రూపొందించబోతున్న విషయం తెల్సిందే.

పాన్ ఇండియా మూవీగా రూపొందబోతున్న ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా కోసం భారీ ఎత్తున ఒక సెట్టింగ్ ను రూపొందిస్తున్నారట. గుణశేఖర్ మార్క్ లో భారీ గా ఖర్చు చేసి ఆ సెట్ ను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ సెట్ లో ఎక్కువ సీన్స్ చిత్రీకరణ జరుగబోతున్నాయట. కేవలం ఆ సెట్ మాత్రమే కాకుండా సినిమా కోసం మరి కొన్ని సెట్టింగ్ లను కూడా నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.

పౌరాణిక సినిమా కాబట్టి అందుకు తగ్గట్లుగా సెట్టింగ్ లను డిజైన్ చేయిస్తున్నారు. సెట్టింగ్స్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమాను నీలిమా గుణ నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించబోతుండగా ఓ యంగ్ స్టార్ హీరో దుశ్యంతుడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Share via
Copy link