అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులకు, వివిధ యూనివర్శిటీల్లో విద్యనభ్యసిస్తున్న తెలుగు విద్యార్ధులకు బీమా సౌకర్యం లేని వారికి వైద్య సహాయం అందించే నిమిత్తం
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని సోమవారం డల్లాస్ లో జరిగిన తానా కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. దీనికి కన్వీనర్లుగా డాక్టర్ అక్కినేని మణి, డాక్టర్ గుమ్మడి సాగర్‌లను నియమించాలని నిర్ణయించారు. ఈ వైద్య విభాగం ద్వారా రాష్ట్రంలో ఉన్న వివిధ ఆసుపత్రులకు సహాయ సహకారాలు అందించాలని, పేదలకు కూడా వైద్య సహాయం అందేటట్లు చూడాలని నిర్ణయించారు. అమెరికాలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం కోసం ఏర్పాటు చేసిన 'తానా టీం స్క్వేర్' ఏర్పాటు చేసి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ శాఖ పనితీరుపై సమీక్ష జరిపారు. గత 12 నెలల కాలంలో లక్షా యాభై వేల డాలర్లను టీంస్క్వేర్ ద్వారా ఆపదలో ఉన్నవారికి, ఆకస్మికంగా మ్రుతి చెందిన వారి కుటుంబాలకు చెల్లించటం జరిగిందని, ఈ టీంస్క్వేర్ ను ఇంకా పటిష్ఠవంతం చేయాలని నిర్ణయించారు. ప్రవాసాంధ్ర పిల్లలకు తెలుగు భాష సులువుగా అర్ధమయ్యే విధంగా బొమ్మలతో కూడిన పుస్తకాలను ప్రచురించాలని దీని కోసం జంపాల చౌదరి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వరద బాధితులకు తానా ద్వారా విరివిగా విరాళాలు అందజేయాలని ప్రవాసాంధ్రులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే 5వేల దుప్పట్లు పంపిణీ చేయటం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి తానా అధ్యక్షుడు కోమటి జయరాం అధ్యక్షత వహించారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, కార్యదర్శి నన్నపనేని మోహన్, కోశాధికారి రాం యలమంచిలిలు తానా ఆధ్వర్యంలో గత ఏడాది కాలంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై నివేదికను సమర్పించారు.
Newer news items:
Older news items: