ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి విఫలమైన కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్ష పదవిపై కన్నేశారు.
పిసిసి పదవిని చేపట్టి తద్వారా రాష్ట్రవ్యాప్తంగా క్యాడర్ ను కూడగట్టి ఎన్నికల్లో కాంగ్రెసును గెలిపించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలనేది ఆయన ఆశయంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెసులో తిరుగులేని నాయకునిగా ఎదిగేందుకు పిసిసి అధ్యక్ష పదవిని పనిముట్టుగా వాడుకోవాలని ఆయన చూస్తున్నారని వినికిడి. ముఖ్యమంత్రి పదవి దక్కదని అర్థమైన తర్వాత నిజానికి, వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించాలని భావించారు. ఆయన వర్గమంతా అందుకు సన్నాహాలు కూడా చేసిందట. అయితే, వైయస్ జగన్ ఎవరికీ చెప్పకుండా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి తనకు పిసిసి పదవి ఇవ్వాలని కోరారని సమాచారం. అందుకు, సరే, చూద్దామని ఆమె అన్నట్లు చెబుతారు. ఈ హామీపైనే ఆయన నమ్మకం ఉంచినట్లు చెబుతున్నారు.మరోసారి పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవడానికే కడపలో వైయస్ కాంస్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టినట్లు చెబుతున్నారు. రాష్టవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పడానికి దాన్ని వేదికగా వాడుకున్నారని సమాచారం. ఏప్రిల్ 2వ తేదీ నుంచి తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన చెప్పారు. ఆ రకంగా ప్రజల్లోకి వెళ్తానని చెప్పడం ద్వారా అధిష్టానానికి పరోక్ష హెచ్చరిక చేసినట్లు చెబుతున్నారు. సొంత పార్టీ పెట్టాలనే ఆలోచనను కూడా ఆయన మరోసారి ముందుకు తెచ్చినట్లు చెబుతున్నారు. అయితే, పార్టీ పెట్టే సందర్భం దాటిపోయిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వల్ల తెలంగాణ కాంగ్రెసు నాయకులెవరూ కలిసి వచ్చే పరిస్థితి ఉండదని ఆయన సన్నిహితులు చెప్పినట్లు సమాచారం.
ఈ స్థితిలో వైయస్ జగన్ ను పిసిసి సమన్వయ కమిటీలో పార్టీ అధిష్టానం వేసింది. తద్వారా వచ్చే శాసనసభ సమావేశాలకు వైయస్ జగన్ అనుచర శాసనసభ్యులు అనివార్యంగా సహకరించేలా చూడాలనేది అధిష్టానం యోచనగా భావిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ బహుశా ఈ సెప్టెంబర్ లో దిగిపోవచ్చు. అప్పటికి ఆ పదవిని తన చేతుల్లోకి తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే అధిష్టానానికి చెందిన నాయకులు, ముఖ్యంగా సోనియా గాంధీ జగన్ ను నమ్ముతారా అనేది అనుమానంగానే ఉంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ మాత్రం జగన్ కు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు సమన్వయ కమిటీలో డి. శ్రీనివాస్ కింద ఆయన పనిచేయాల్సి ఉంటుంది. అందుకు జగన్ ఏ మేరకు అంగీకరిస్తారనేది కూడా అనుమానమే. అయితే, జగన్ పరిస్థితి రెంటికి చెడిన రేవడి అవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26



















