పార్టీలో ప్రాంతీయ విభేదాలు ముదురుతుండడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తీవ్ర సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది.
ఈ విభేదాలు నియంత్రించలేని స్థితికి చేరుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణ తనకు రెండు కళ్లలాంటివని చెబుకున్న చంద్రబాబు రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహం బెడిసే కొట్టే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇరు ప్రాంతాల నాయకులు హద్దులు దాటి వ్యవహరిస్తుండడాన్ని చంద్రబాబు జాగ్రత్తగా గమనిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పడినా, ఏర్పడకపోయినా ఫరవాలేదు, కాంగ్రెసు పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగానే ఇరు ప్రాంతాల నాయకులు వ్యవహరించాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే ఇరు ప్రాంతాల నాయకులు కూడా దాంతో ఆగడం లేదని తెలుస్తోంది.తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీని వ్యతిరేకించే విషయంలో సీమాంధ్ర పార్టీ నాయకులు హద్దులు దాటుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. కె. ఎర్రంనాయుడు, ఎంవి మైసురా రెడ్డి కమిటీని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో లాబీయింగ్ చేస్తుండడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారిద్దరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ వారు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర హోం మంత్రి చిదంబరంపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ ఎర్రంనాయుడు, మైసురా రెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారని, ఇది సరైన చర్య కాదని తెలంగాణ నాయకులు భావిస్తున్నారు. అలాగే రాయలసీమకు చెందిన శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ పై కూడా తెలంగాణ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. కేశవ్ కూడా హద్దులు దాటుతున్నారని వారంటున్నారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26



















