దేశ స్థూల జాతీయోత్పత్తి నిట్టనిలువునా కిందికి పయనిస్తోంది. డిసెంబరులో ముగిసిన మూడో త్రైమాసికంలో జీడిపీ వృద్ధి రేటు ఏకంగా 5.3 శాతానికి పడిపోయి దేశాన్ని ఆర్థిక మాంద్యపు సంక్షోభంలో పడవేయనుంది. గడిచిన ఐదేళ్లలో ఈ స్థాయిలో ఒకేసారి జీడీపి తగ్గిపోవడం ఎన్నడూ జరుగలేదు.
గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి వృద్ధి రేటు 8.9 శాతంగా ఉంది. అటువంటిది నేడు ఏకంగా 5.3 శాతానికి పడిపోవడం పట్ల ఆర్థిక నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వృద్ధి రేటులో ఒక్కశాతం క్షీణత నమోదైతేనే లక్షల్లో ఉద్యోగాలు ఎగిరి పోతాయి. మరి ఏకంగా దాదాపు 3 శాతానికి పైగా దిగజారితే భవిష్యత్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే భయమేస్తుంది.
ఒకవైపు ప్రభుత్వాలు ఎడాపెడా ఆయా రంగాలకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తున్నప్పటికీ వ్యవసాయ, తయారీ రంగాలు కుదేలై కుంగుతూనే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు 6.9 శాతం ఉండగా... ఇప్పుడది 2.2 శాతం మేర దిగజారింది. తయారీ రంగమైతే గత ఆర్థిక సంవత్సరంలో 8.6శాతం ఉంటే ఇప్పుడది 0.2శాతం మేర కుంగింది.
ఇక మిగిలింది పారిశ్రామిక రంగం. ఈ రంగంలో ఆర్థిక మాంద్యం ఇప్పటికే తన పంజా విసిరింది. పలు కంపెనీలు లేఆఫ్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక రంగాన్ని ఆదుకుని ఊపిరిలూదాల్సిన బాధ్యత రిజర్వు బ్యాంకుదేనని పలు పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
స్థిరాస్తి , ఫైనాన్సింగ్, బీమా, వ్యాపార, నిర్మాణ రంగాలను సైతం ఆర్థిక మాంద్యం ఆవహించింది. గత ఆర్థిక సంవత్సరంలో వీటి వృద్ధి రేటు 11.9 శాతం ఉండగా... ఇప్పుడది 9.5 శాతం వద్ద దోబూచులాడుతోంది. ఇలా అన్ని రంగాలను ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేస్తోంది.
ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉద్దీపన ప్యాకేజీల ప్రభావం పెద్దగా చూపడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెపుతున్న 7 శాతం వృద్ధి రేటు సాధించడం అంత తేలిక కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26






















